రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 సవంత్సరంలో శారదాదేవి, దేవేంద్రనాథ్ ఠాగూరులను దంపతులకు జన్మించాడు. ఈయన బాల్యంలోనే తల్లి మరణించింది. ఈయనకు నిరాడంబర జీవితాన్ని బాల్యం నుండే తండ్రి అలవాటు చేశాడు. కొంతకాలం ఇంటి వద్దనే విద్యాభ్యాసం జరిగింది. తరువాత మామూలు పాఠశాల్లో కొన్నాళ్ళు విద్యాభ్యాసం జరిగింది. రవీంద్రుడు తండ్రి వద్ద సంస్కృతం; అన్నగారి వద్ద ఆంగ్లభాషను నేర్చాడు. సామాన్య జనులతో కలియనిచ్చేవారు కారు. వీరికి సకల సేవలు సేవకులే చేసేవారు. ప్రకృతి దృశ్యాలంటే ఇతనికి ఇష్టం. తండ్రితో తిరిగి లోకానుభవాన్ని సంపాదించాడు.

రవీంద్రుడు తన ఎనిమిదవయేట నుండియే పద్యాలు వ్రాయడం ప్రారంభించాడు. మొట్టమొదట ఈయన వంగభాషలో పద్యాలు విస్తారంగా వ్రాయడం ప్రారంభించాడు. రవీంద్రుడు తన 14 ఏట తండ్రితో కలసి ఇంగ్లాండు వెళ్ళాడు. అక్కడ వారి పరిస్థితుల్ని, ఆచార వ్యవహారాల్ని గ్రహించి భారత ప్రజలకు అందుబాటులో ఉండు స్వేచ్ఛా భాషలో కథలు, కల్పనలు, వ్యాసాలు, నాటకాలు మొదలైనవి వ్రాశాడు.

ప్రకృతి అందాలంటే అధికమైన ప్రేమ. దీనితో రవీంద్రునిలో గానం, చిత్రకళ చోటు చేసుకున్నాయి. ఇతని నవలలు, నాటకాలు పాశ్చాత్యుల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఇతను వ్రాసిన ‘గీతాంజలి’ అనే కావ్యం పాశ్చాత్యులకు అమితానందాన్ని కల్గించి ముగ్ధుల్ని చేసింది. ప్రపంచంలో అత్యుత్తమ కవికీయబడు ‘నోబెల్ బహుమతి 1913 సం॥రాన గీతాంజలి అనే కావ్యానికి ఈయబడింది.

ఈయన వ్రాతలో మానవ జీవితం; ప్రకృతి చిత్రాలు జీవకళతో మన కన్నుల ఎదుట నృత్యం చేస్తాయి. ఈయన వ్రాసిన నవలలకు, కథలకు, నాటకాలకు ‘హద్దులేదు. రవీంద్రునికి ‘డాక్టర్’ బిరుదు, ‘సర్’ బిరుదు లభించాయి.

ఈయన శాంతినికేతనమను లోక ప్రసిద్ధమైన విద్యాబోధనా సంస్థను కలకత్తా సమీపాన నెలకొల్పాడు. దీనికి ప్రపంచమందన్ని దేశాల నుండియు శిష్యులు శాంతిప్రియులును వచ్చి రవీంద్రుని ఉపదేశాలను గ్రహించారు. గాంధీ నెహ్రూలును మన దేశమందలి నేటి ప్రఖ్యాత మంత్రులును, ఈ విశ్వవిద్యాలయమునందును కొంతకాలం గడిపారు. గాంధీ మహాత్ముడు ఈతని “గురుదేవ్” అని వ్యవహరించెడివారు. దీనిని ‘విశ్వభారతి’ గురుకులమంటారు. ఈనాడు కూడా శిష్యుల్ని ఆకర్షిస్తోంది.

ఆంగ్లేయులు 1919 సం॥రంలో పంజాబులో జలియన్ వాలాబాగ్ లో భారతీయుల్ని నిర్దాక్షిణ్యంగా చంపినపుడు ఈయన తన సర్ బిరుదాన్ని పరిత్యజించాడు. జీవితాంతం వరకును అపార గ్రంథ రచనను సాగించి విజ్ఞాన కాంతుల్ని వెదజల్లాడు. ఈయన తన ఎనుబది ఏట 1941 సం॥రాన ఆగష్టు 7. తేదీన మరణించాడు . 1961 సం॥రంలో విశ్వకవి జయంతి వేడుకలు ప్రపంచంలో అన్ని దేశంలో  వైభవంగా జరిగాయి.

Write A Comment