Read Top Telugu 100+ samethalu in telugu, లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట.

  1. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

    ఒక అధికారి తన కింద పనిచేసే వారిని అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు వేస్తాడు. అన్నిటికీ సమాధానము చెప్పవలసిందే లేకపోతే ఇబ్బంది. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అవుతాడు.
  2. భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట

    బజార్లో పెడితే ఎవరైనా దాన్ని ఎత్తుకెళ్తారు అని తెలిసి కూడా కోడి గుడ్డు పెట్టిందంటే దానికి అస్సలు భయం లేదని అర్థం. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు దాని పర్యావసానాలు ఆలోచించి చేయాలి అని చెప్తోంది ఈ సామెత
  3. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా!

    బాధలో కాని ఆనందంలో కాని ఉన్నప్పుడు నోటికి అదుపు లేకుండా మట్లడుతుంటాం కొన్నిసార్లు మనం. దాని వల్ల కలిగే నష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరము అనుభవించే ఉంటాం. దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఊహించటం కష్టం. కనుక మన నోటి నుంచి జాలువారే ప్రతి మాట చాల ముఖ్యం అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం.
  1. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.

    మన నోటి నుండి వచ్చే వాక్యాలు కత్తి కంటే పదునైనవి.. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిస్వార్థంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఒకరిని చూసి మరొకరు నిస్వార్ధంగా ఉండటం నేర్చుకుంటారో.. అప్పుడు ఆ ఊరు కూడా మంచిదవుతుంది అని ఈ సామెత యొక్క అర్థం.
  2. చేతిలో సుత్తి ఉంటే ఏదైనా మేకు లానే కనపడుతుంది.

    మన జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యని కేవలం మనకి తెలిసిన పరిమిత జ్ఞానంతోనే ఆలోచించకుండా విశ్లేషణ చెయ్యాలి అని ఈ సామెత అర్థం.
  3. లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట.

  4. ఇచ్చేవాడిని చూస్తే, చచ్చినవాడు కూడా లేచి వస్తాడు

    ఉచితంగా ఏదన్నా దొరుకుతోంది అంటే దాన్ని దక్కించుకోవటానికి ఏదైనా చేస్తాం, ఎందుకంటే ఆశ అనేది సర్వసాధారణం కనుక. కాని కొంతమందిలో ఇది చాలా ఎక్కువ పాళ్ళలో చూస్తాం. అలా అత్యాశ ఉన్నవాళ్ళ గురించి చెప్పే సామెత ఇది.
  1. డబ్బు మాట్లాడుతూంటే సత్యం మూగ పోతుంది

    డబ్బు ముందు సత్యం నిలవలేదు అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం.
  2. వసుదేవుడంతటివాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు!

    “ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు” అని మన పవర్ స్టార్ సినిమాలో చెప్పినట్టు…ఎంతవాడికైనా ఒక్కోసారి కాలం కలసి రాకపోతే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. వారి జీవితం ముందుకి సాగాలి అంటే ఎంతటి స్థాయికైనా దిగాల్సి వస్తుంది. అలాంటి సంధర్భాల్లో ఈ సామెత చెప్తూ ఉంటారు.
    అసలు కథ…
    లోకం మాటేంటంటే, పరమాత్మని తలపై బుట్టలో ఉంచుకుని తీసుకు వెళుతున్న వసుదేవుని చూసి గాడిద ఓండ్ర పెట్టిందనీ, ఆ అరుపుకు కావలివారు లేస్తే పరమాత్మని వ్రేపల్లె చేర్చడం కుదరకపోవచ్చు గనక ఓండ్ర పెట్టద్దని వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటారు.
  3. చింతలు లేకపోతే సంతలోనైనా నిద్రపోవచ్చు!

    మనిషికి మనశ్శాంతి ఉన్నప్పుడే హాయిగా ఆనందంగా ఉంటుంది. అలాంటప్పుడే కంటినిండా కునుకు పడుతుంది. చింతలు, చికాకులు, భయాలు, ఆందోళనలు అశాంతికి గురి చేస్తాయి, నిద్రను దూరం చేస్తాయి. అందుకే చింత లేకుండా హాయిగ బతికే తీరులో బతకండీ అని చెప్తుంటారు పెద్దలు.
    సంతలో అంతా సందడి సందడిగా ఉంటుంది. అమ్మకందారుల కేకలూ, కొనుగోలుదారుల బేరాలు. వీటితో ధ్వని కాలుష్యంగా ఆ ప్రదేశమంతా ఉంటుంది. అయినప్పటికీ ఒక మనిషి హాయిగా అక్కడ నిద్రపొతున్నాడంటే అతనికి ఎలాంటి చింతలు లేవని అర్థం.
    అంటే చింతా, చికాకులు లేకుండా ఉండటంలోనే అసలైనా ఆనందం ఉన్నదన్నది ఈ సామెత సందేశం.
  1. కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది.

    ఆశకొద్దీ ఎక్కువ పదార్థాలు వడ్డించుకున్నా తినలేకపోవటం.
    ఆకలితో వున్నప్పుడు ఎంతో తినాలని ఆశ పడతారు. తీరా తినడానికి కూర్చున్నాక తన కడుపుకు పట్టినంత మాత్రమే తినగలరు. ఆ వుద్దేశముతో చెప్పినదే ఈ సామెత.
  1. మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్టు!

    వెనకటికి ఒకాయన సాము గరిడీ విద్యలు నేర్చాడట. ఆ విద్యను చూపి అందరి మీదా జబర్దస్తీ చేసేవాడట. అతని పహిల్వాన్‍ చేష్టలకు ఆ ఊరు ఊరంతా భయపడేదట. జనులు తనను చూసి భయపడటంతో అతగాడు మరింత రెచ్చిపోయి అందరిపై పెత్తనం చెలాయించేవాడట. అతగాడెంతో మొనగాడన్నట్టు ఆ ఊరివాళ్లంతా అతనికి వంగి వంగి దండాలు పెట్టే వారట. ఏ ఆపద వచ్చినా, కష్టమొచ్చినా అతనికే చెప్పుకునే వారట. అయితే అయ్యవారికి అంత ‘సన్నివేశము’ లేదు. ఏదో కాస్త కండలు చూపి పైపై ఆర్భాటం చేయటమే తప్ప నిజానికి అతనికి ఏమాత్రం వస్తాదుతనం లేదు. ఒకనాడు ఊళ్లో దొంగలు పడ్డారు. అందరికంటే ముందు ఈ వస్తాదు గారే తలుపులు వేసుకుని దాక్కున్నారు. అందరూ ఇది చూసి అయ్యో.. ఇదా నీ మగతనం అని నోళ్లు నొక్కుకున్నారు. ఒకరోజు ఊళ్లో ఒక ముసలావిడ ఇదే విషయమై దారిన వెళ్తున్న వస్తాదు గారిని ప్రశ్నించిందట. దీంతో ఎక్కడ లేని పౌరుషం పుట్టుకొచ్చిన ఆ వస్తాదు.. పట్టరాని కోపంతో వృద్ధురాలు అని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడు. ఇది చూసిన వారంతా.. దొంగలు, దుర్మార్గుల్ని ఏం చేయలేడు కానీ, బలహీనులపై ప్రతాపం చూపుతున్నాడంటూ తిరగబడ్డారు. అటువంటి వ్యక్తిని ఉద్దేశించే పై సామెత పుట్టింది.. ‘మూడు నెలలు సాము విద్య నేర్చి.. చివరకు ముసలిదాన్ని కొట్టాడు’ అని ఎవరైనా అధికుల మని, అధికారం చాటుకునే వారి గురించి దెప్పి పొడిచే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.
  2. కుడి చేతితో చేసే దానం ఎడమ చెయ్యి ఎరుగరాదు!

    నిస్వార్థంగా చేసే దాన్నే దానం అంటారు. తిరిగి ఏమైనా ఆశిస్తే (పుణ్యం కూడా) దాన్ని వ్యాపారం అంటారు. అందుకే పెద్దలు కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలీకూడదు అంటారు. మనం చేసిన మంచి కనపడేటప్పుడు మనం కనపడనవలసిన అవసరం లేదు అని చెప్తోంది ఈ సామెత.
  3. దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట.

    దయగల వాడు ఐతే పెళ్ళాన్ని కొట్టకుండా వుండాలి కాని, ఎవరకీ తెలియకుండా జాగ్రత్త పడటం ఏంటి!
    కొంతమంది ఇలాగే నలుగురి ముందూ మంచిగా ఉండాలి ఇంట్లో ఎలా ఉన్నా ఫర్వాలేదు అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళను గూర్చి చెప్పే సామెత ఇది.
  1. రోజూ చచ్చేవాడికి ఏడ్చేవారు ఉండరు

    వరైనా ఒకసారికి అవసరానికి సహాయం చేస్తారు. ప్రతి సారి చెయ్యరని చెప్పేదే ఈ సామెత.
  2. అంగట్లో అన్నీ ఉన్నా  అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.

    సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు. కాని ఎన్ని చేసినా ఏదో ఒక కారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు.
    ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు.
  3. అక్కరకు వచ్చినవాడే మనవాడు.

    అక్కర అంటే అవసరం. మనకు అవసరం ఉన్నప్పుడు, ఆపద సమయాలలో సహాయపడిన వారే మన ఆప్తులు అవుతారు. అంతే కానీ, అవసరమైనప్పుడు సహాయపడని బంధువులు ఉన్ననూ వ్యర్ధమని, మనవారు కాలేరని ఈ సామెత అర్థం.
  1. పేరు గొప్ప ఊరు దిబ్బ.

    ఉదాహరణకి కొన్ని దుకాణాలకు సురుచి అని, రుచి అని ప్రసిద్ధమైన వంటకాల రుచులకు ప్రసిద్ధి అని వాటి గొప్పదనాన్ని చాటుకునేలా బోర్డులు తగిలిస్తారు. విపరీతమైన ప్రచారం సాగిస్తారు. అది నమ్మి ఆ హోటల్‍కు వెళ్తే.. అక్కడి వంటకాలు రుచి చూస్తే ఆశించిన స్థాయిలో ఉండవు. అటువంటి సందర్భంలో నిట్టూరుస్తూ మనసులో అనుకునే మాటే ఇది. పేరు చూసి నమ్మి మోసపోయాం.. ఇంకెప్పుడూ ఆ హోటల్‍కు వెళ్లకూడదు అనుకునే సందర్భంలో ఈ సామెతను వాడతారు.
  2. తూర్పుకు తిరిగి దండం పెట్టు!

    ఎవరికన్నా ఎదన్నా ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ మనిషి తిరిగి మళ్ళీ మనది మనకి ఇవ్వలేని పరిస్తితి వచ్చిన సందర్భంలో ఈ సామెత వాడతారు.
    సరే తూర్పుకే ఎందుకు తిరిగి దండం పెట్టాలి? వేరే దిక్కులు లేవా అంటే!!! తూర్పుని మనం పుణ్యమైన దిక్కుగా అభివర్ణిస్తాం. ఇంద్రుడు దానికి అధిపతి. సూర్యుడు కూడా తూర్పు నుండే ఉదయిస్తాడు. అందుకే ఇళ్ళల్లో కూడా ఎదన్నా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నా తూర్పు ముఖంగా కూర్చోమని అంటారు. కనుక తూర్పుకి తిరిగి దండం పెడితే, ఇక నీ పోయిన సంపద వల్ల కనీసం నీకు పుణ్యం అయినా దక్కుతుంది అని అలా సరదాగా అంటారు.
  3. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట

    ఏదైనా పని చేయడానికి ఎంచుకున్నపుడు ఆ జట్టులో ఎవరికీ సరైన అవగాహన లేకపోతే ఈ సామెతను వాడతారు.
    పూర్వకాలంలో సన్యాసులు తమ ఒంటికి బూడిద రాసుకోవడం మీకు తెలిసిందే!
  1. పొరుగింటి పుల్ల కూర రుచి!

    పొన్నగంటి కూర, చుక్క కూరలను పుల్ల కూరలంటారు. పులుపు చాలామందికి పడదు కారణం దగ్గును తెస్తుంది కనుక. ఆలాంటి పుల్ల కూరలు కూడ పక్కింటి వాళ్ళు చేస్తే రుచికరంగా ఉంటాయి. ఇంట్లో భార్య ఎంత అందంగా ఉన్నా, ఎంత రుచికరంగా వంట చేసినా, వంకలు పెడుతూ పొరుగు లేదా పరాయి స్త్రీల పట్ల వ్యామోహం పెంచుకొని శరీర ఆరోగ్యం చెడగొట్టుకోవద్దని మర్మ గర్భంగా మనకి చెప్పడం ఈ సామెత ఉద్దేశం. ఇంటి ఇల్లాలిని విమర్శించడానికి పుట్టిన సామెత ఇది.
  2. తెగించి దానం చేస్తా తేరా పిడికెడు రాళ్ళు అన్నాడట!

    నేను ఉదారవాదిగా ఉండాలని నిర్ణయించుకున్నాను, చేతినిండా ధాన్యం తీసుకురండి అన్నాడట ఒక రాజు. వారి ఉదారత అంతా ఆ గుప్పెడు ధాన్యం పంచటంలోనే ఉందన్నట్టు!!
    మాటలు కోటలు దాటటం లాంటిదే ఇదీనూ. కొందరు చేసే హడావిడి అంతా ఇంతా కాదు, కాని అసలు చేసేది శూన్యం.
  1. తాటి చెట్టుఅంటే ఎందుకు ఎక్కావురా దూడ గడ్డి కొరకు అన్నాడట!

    అబద్ధం చెపితే అతికినట్టుండాలి. అలా చేత కాని వారికి ఈ సామెత వాడతారు.
  2. ముందొచ్చిన చెవులకన్నా వెనక వచ్చిన కొమ్ములే వాడి.

    ఇది చాలా విషయాల్లో మనం వినేదే!
    ఏ మనిషైనా ముందు నుంచి తన జీవితంలో ఉన్నవారికంటే కొత్తగా వచ్చిన వారికీ కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే ఈ సామెత వాడతారు!
  1. నిండా మునిగిన వాడికి చలేంటి!

    చన్నీళ్లలో దిగేటప్పుడు మొదట్లో చలిగా వుంటుంది. పూర్తిగా దిగాక చలి వుండదు. అలాగే కష్టాలు ఒకటి రెండు వస్తే మనిషి తమాయించుకోగలడు. అన్ని కష్టాలు ఒక్కసారిగా వస్తే అతనికి తెగింపు వచ్చేస్తుంది. ఆ అర్థంతో ఈ సామెత పుట్టింది.
  2. రాజ్యాలు పోయినా కిరీటాలు వదలేదని ని

    పరిస్థితులు ఇంతకముందులా విలాసవంతంగా బతికినట్టు లేకపొయినా, తాము మాత్రం అలాగే బతకాలి అనుకుంటారు కొంతమంది. ఎక్కడా “తగ్గేదే లే” అన్నట్టు. అది వారి ఇష్టానికి సంబంధించినది అయినప్పటికీ, అలాంటి వారిని గూర్చి హాస్యం గా చెప్తుంది ఈ సామెత.
  3. అంతా తెలిసినవాడూ లేడు ఏమీ తెలియనివాడూ లేడు!

    మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసిన వాడున్నూ, ఏవిషయము కొంతైనా తెలియని వాడున్నూ లేడని దీని అర్థము.
  4. అత్త మీద కోపం చూపించినట్లు!

    దుత్త అంటే కడవ. కోడలు అత్తగారి మీద కోపంతో ఆవిడని ఏమీ అనలేక దుత్తని పగులగొట్టిందట. ఆ విధంగా ఆవిడపై కోపాన్ని తీర్చుకుంది.
    ఇలా ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీద చూపిస్తున్న సందర్భంలో ఈ సామెత వాడతారు.
  5. ఆలస్యం అమృతం విషం!

    క్షీరసాగర మథనం నుంచి పుట్టిన సామెత ఇది.
    క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణం లోని బాలకాండలోను మహాభారతంలోని ఆది పర్వములో కూడా స్పృశించబడుతుంది. ఇదే ఇతిహాసము పురాణాలలో కూడా చెప్పబడింది.
    దేవ దానవులు పాలసముద్రాన్ని చిలకసాగారు. అమృతం పుట్టింది. దాన్ని వారందరికీ పంచడానికి శ్రీహరి పూనుకున్నాడు. ముందు దేవతలకు పంచసాగాడు. తమకూ ఇవ్వమని వచ్చిన దానవులను కాసేపు ఆగమని చెబుతూ వచ్చాడు. చివరికి అమృతమంతా అయిపోయింది. దానవులకు లేకుండా పోయింది. ఆ విషయంపై పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడొక దానవుడు, అమృతం ముందే తీసేసుకోవాల్సింది, అనవసరంగా ఆలస్యం చేశాం, మన ఆలస్యం వల్ల అమృతం పోయి విషం (యుద్ధం) దక్కింది అన్నాడట. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఆలస్యం చేస్తే అనుకున్న మంచి ఫలితం దక్కకపోగా చెడు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో దీన్ని వాడతారు.
  1. అన్యాయపు సంపాదన ఆవిరైపోతుంది

    నిజాయితీగా మంచి పద్ధతిలో సంపాదించిన ధనము నిలకడగా మనదగ్గరే ఉండి, మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే విధంగా అన్యాయంగా ఆర్జించిన సొమ్ము మన దగ్గర నిలబడక, వృధాగా ఖర్చు అయి కనిపించకుండా పోతుంది. ధన సంపాదనకు అన్యాయ మార్గాన్ని ఎంచుకోరాదని ఇందులోని గూడార్థం
  2. ఏమీ లేని ఎడారిలో ఆముదం చెట్టే మహావృక్షం!

    చుట్టుపక్కల వారికంటే నైపుణ్యం ఉన్నంత మాత్రాన, ఎవరూ ఉన్నతులు అయిపోరు. ప్రతిభకీ, నైపుణ్యానికీ కొల బద్దలు ఉండవు కదా. మనకంటే నిపుణులు తారసపడినప్పుడే అది తెలిసొస్తుంది. ఈ విషయాన్ని గుర్తుచేసేదే ఈ సామెత. ఒక సాధారణ వ్యక్తి ఎంతో గొప్ప వాడిగా చెలామణి అవుతున్నప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
  1. తిక్కలోడు తిరనాళ్ళకు వెళితే ఎక్కా దిగా సరిపోయిందట!

    ఒక తెలివి తక్కువ వాడు అందరూ వెళుతున్నారు కదా అని తిరునాళ్ళకు(జాతర) బయలుదేరాడట. అక్కడకు వెళ్లిన అందరూ, కొండపై ఉన్న ఆ దేవతను దర్శించుకుంటుంటే, ఇతను మాత్రం, తిరనాళ్ళకు ఎందుకు వెళ్ళాడో తెలియని అమాయకుడు కాబట్టి, ఆ కొండపైకి చేరుకోవడానికి ఉన్న మెట్లమీద పదే, పదే ఎక్కుతూ, దిగుతూ కాలక్షేపం చేస్తూ, ఆ కొండపైనున్న దేవతను, దర్శించుకోకుండా తిరిగి వచ్చేశాడట.
    ఎవరైనా ఇదే విధంగా, చేయవలసిన పనిని వదలిపెట్టి, అనవసరమైన పనులను చేస్తుంటే, ఆ సందర్భంలో “తిక్కలవాడు తిరునాళ్ళకు వెళితే, ఎక్కా, దిగా సరిపోయిందట” అలా ఉంది నీ పని, అని చమత్కరిస్తారు
  2. అదృష్టం అందలమెక్కిస్తానంటే బుద్ధి బురదలోనికి లాక్కెళ్చిందట!

    అందలము అంటే పల్లకి. ఒక్కోసారి మన జీవితాన్ని బాగు పరచే ఆలోచనలు, అవకాశాలు వచ్చినప్పటికీ, వాటిని అందిపుచ్చుకోకుండా శంకిస్తూ, కాలాన్ని వృధా చేస్తున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
  3. జీతం బత్తెం లేకుండా తోడేలు గొర్రెలను కాస్తానందట!

    గొర్రెలకు మేత మేపటానికి తోలుకువెళ్ళి, అవి ఏ జంతువుల బారిన పడకుండా, గమనించడాన్ని కాపు కాయడం అంటారు. ఈ సామెతలో గొర్రెలను భుజించే తోడేలు, గొర్రెలకాపరితో “నాకు ఏ జీతం ఇవ్వద్దు, నేను వీటిని జాగ్రత్తగా కాపు కాస్తాను, చక్కగా మేతమేసేటట్లు చూస్తాను. నీవు నిశ్చింతగా నీ పనులు చూసుకో, నీకు నేను ఈ సహాయం చేస్తాను” అని అన్నదట.

    అంతటితో అమాయకుడైన గొర్రెల కాపరి తోడేలు మాటలను నమ్మి, దానికి ఆ పనిని అప్పజెప్పాడు. ఇంకేముంది! ఆ గొర్రెల మందలోని గొర్రెలను, రోజుకి ఒక్కొక్క గొర్రె చొప్పున, ఆరగించింది తోడేలు. చివరికి ఆ కాపరి లబో దిబోమని ఏడ్చాడు. ఈ విధంగా అందరినీ గ్రుడ్డిగా నమ్మరాదని తెలియ చేస్తుంది ఈ సామెత.
  1. ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటినాక బోడి మల్లయ్య.

    ఎవరైనా చేసిన సహాయాన్ని మరిచిపోయి కృతఘ్నతతో(ingratitude) వ్యవహరించే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు. అవసరం తీరే వరకూ ముఖ స్తుతి చేసి ఆపై హేళన చేసే నీచ బుద్ధి కలవారిని ఉద్దేశించినదీ సామెత.
  2. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు!

    అసమర్ధుల సహాయం మీద ఆధార పడకూడదని దీని భావం. కుక్కకి ఈదే సామర్ధ్యం తక్కువ. ఆ కుక్క తోకను పట్టుకుని గోదావరిని దాటాలనుకోవటం అసమర్ధుని సహాయంతో మహా కార్యాన్ని సాధించాలనుకోవటంలాంటిదే అని చెప్పడమే ఈ సామెత ఉద్ధేశ్యం.
  3. చెప్పేవి నీతులు తీసేవి గోతులు!

    జనాలకి నీతి వాక్యాలు చెపుతూ తాము మాత్రం నీతి లేకుండా పనులు చేస్తున్న సందర్భంలో ఈ సామెత వాడతారు.
  4. గంధ ద్రవ్యాలు మోసినా గాడిద గాడిదే అన్నట్టు!

    ఎన్ని మంచి మాటలు చెప్పినా మరెంత మంది సత్పురుషులు వారి చుట్టూనే ఉన్నా, వారి మనస్సు మాత్రం మలినాలతో నిండి ఉన్నప్పుడు ఈ సామెత వాడతారు.
  5. చేసిన పాపం చెబితే పోతుంది!

    పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అన్నట్టు, తాను చేసిన పాపం తన నోటితో చెప్పి ఒప్పుకుంటే పాపం పోతుంది అని పద్మ పురాణం భూమి ఖండం లో చెప్పబడింది.
    అదే చెప్తోంది ఈ సామెత
  1. పాలకుండ కాడ పిలిని కాపలా పెట్టినట్టు!

    “దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు” అనే సామెత లాంటిదే ఇదీనూ! ఎవరైతే ఆ పని చెయ్యకూడదో, వాళ్ళకే ఆ పని అప్పచెప్తే ఈ సామెత వాడతరు
  1. వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్ల తాగిన వానిని చావబాదినట్టు!

    ఒకరు చేసిన తప్పుకి మరొకరు బలి అవ్వటం అనేది జరుగుతూనే ఉంటుంది. అలాంటి సంధర్భంలో వాడే సామెత ఇది.
  1. దూపయినప్పుడే బాయి తవ్వుకున్నట్లు!

    దూప అంటే దాహం. దాహం వేసినప్పుడే బావి తవ్వుకొవటం అనేది తెలివితక్కువ తనం. ముందు చూపు ఉన్నవాడు, బావిని తవ్వి పెట్కుని అవసరం వచ్చినప్పుడు దాహం తీర్చుకుంటాడు. ముందు జాగ్రత్త లేనివారిని గూర్చి చెప్పే సామెత ఇది.
  2. చారాణా దావత్ కు బారాణా టాంగా కిరాయి!

    అణా అనేది బ్రిటిష్ పాలనలోని మారక ద్రవ్య ప్రమాణం. ఒక అణాకు 6 పైసలు. ఇక చారాణా అంటే 25 పైసలు, బారాణా అంటే 75 పైసలు అంటారు.
    లాభం లేకపోయినా సరే నష్టం వచ్చినా సరే డాబులకి ఆర్భాటాలకి పోయి ఇల్లు గుల్ల చేసుకునేవారి గురించి చెప్పే సామెత ఇది
  1. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు

    ఎదైనా దెబ్బ మీద దెబ్బ తగుల్తున్నప్పుడు ఈ సామెత వాడతారు.
  2. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు

    ఏ మనిషైనా తప్పులు చెయ్యటం సహజం. అలా తప్పులు చేసినప్పుడల్లా వాటిని సరిదిద్దుకోవటం అనేది సాధ్యం కాదు. అలా సరిదిద్దుకోలేని సందర్భాల్లో పశ్చ్యతాపం అనేది ఆ మనిషికి ప్రాయశ్చిత్తం కలిగిస్తుంది అని అంటారు. కనుక ఎవరికి ఐతే మన తప్పు వల్ల నష్టం కలిగిందో వారి దగ్గరకు వెళ్ళి తప్పుని ఒప్పుకుని క్షమాపణ కోరుకుంటే, అంతకు మించిన ప్రాయశ్చిత్తం ఉండదు అని ఈ సామెత చెప్తోంది.
  3. పేదవాడి కోపం పెదవికి చేటు!

    పేదవాడు అంత కష్టపడేది ఆ నాలుగు మెతుకుల కొరకే. ఎవరన్నా దయ తలచి నాలుగు ముద్దలు పెడితే, దేనికో కోపం వచ్చింది అని తన అలక తిండి మీద చూపిస్తే నష్టం వారికే కదా. అదే చెప్తోంది ఈ సామెత.
  1. దున్నంగవోయి దులపంగ వచ్చిండట!

    సోమరిపోతులు, బద్దకించే వారు, మాటలు చెప్పి పని తప్పించుకుపోయే వాళ్లను ఉద్దేశించి చెప్పిందే ఈ ‘దున్నంగవోయి దులపంగ వచ్చిండట’ సామెత. ఎవరో చేసిన ఆ కష్టాన్ని అనుభవించడానికి ప్రయత్నించే వాళ్లకు కూడా వర్తిస్తుంది. ఈ తరహా వ్యక్తులు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు తోడు ఉంటారు. తీరా పని ప్రారంభంకాగానే తుర్రు మంటారు. ఆ పని కార్యరూపం దాల్చి, ప్రతిఫలం అనుభవించే సమయానికి మళ్లీ అక్కడ ప్రత్యక్షమవుతారు. ఈ సామెతలో దున్నంగ పోయి అంటే.. పొలం దుక్కి దున్నేటప్పుడు వెళ్లి, వడ్లు దులిపే సమయానికి రావడం. సోమరితనంతో శ్రమ చేయలేక ప్రతిఫలం కోసం వచ్చేస్తారు. అలాంటి వారికి చివాట్లు పెట్టే సందర్భంలో ‘దున్నంగవోయి దులపంగ వచ్చిండు’ అని ప్రయోగిస్తుంటారు.
  2. శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట!

    శుభం అంటే మంచి అని. మంచి మాటలు మాట్లాడటం, మంచిగా ఆలోచించటం కొంతమందికి సాధ్యం కాదు. ఏదైనా పని మొదలు పెట్టేముందు వక్రంగానో లేక నిరాశపరిచే విధంగానో మాట్లాడుతుంటారు. అలాంటివారిని ఉద్ధేశించి చెప్పేక్రమంలో దీనిని వాడుతుంటారు.
  3. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటలో నిజం అంతుంది!

    నేతి బీరకాయ అనేది ఒక కూరగాయ. వాస్తవానికి అందులో నెయ్యి ఉండదు. కనుక అందులో నెయ్యి ఉన్నది అన్న మాటలో ఎలా ఐతే నిజం లేదో కొంతమంది చెప్పే మాటల్లో కూడా నిజం ఉండదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు!!
  4. ఎక్కడైనా బావే కానీ వంగతోటకాడ కాదు!

    వంగ చెట్టు దురద స్వభావము కలిగి ఉంటుంది. అందుకే వంగతోటలో సరసాలు ఆడకూడదు. మరొక అర్థంలో కూడా ఈ సామెతను వాడుతుంటారు. బావ వరస అయిన వాడు వంగ తోట వద్దకు వస్తే ఎక్కడ వంకాయలు అడుగతారేమోనని ముఖం చాటేస్తారని ఈ సామెకు అర్థం.
  5. అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవళికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట!

    ఇది హాస్యోక్తమైన సామెత. అమాయకులను సరదాగా ఆట పట్టించే సందర్భాలలో ఈ సామెతను పల్లెల్లో బాగా ఉపయోగిస్తుంటారు. అలాగే, సమయం, సందర్భాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉద్దేశించి కూడా ఈ సామెతను వాడుతుంటారు. కొందరికి లౌక్యం తెలియదు. నలుగురిలో ఎలా వ్యవహరించాలో తెలియదు. అలాగే, కొన్ని ఉద్దేశాల్లోని పరమార్థమేమిటో కూడా వారికి తెలియదు. అటువంటి వారు ఆ ఉద్దేశాలకు విరుద్ధమైన పనులు చేస్తుంటారు. అటు వంటిదే ‘అమాయకుడికి అక్షింతలు ఇస్తే అవతలికి వెళ్లి నోట్లో వేసుకున్నా’డనే సామెత. అక్షింతలను శుభకార్యాలు, వధూవరులను ఆశీర్వదించే నిమిత్తం ఇస్తారు. వీటిని వధూవరుల తలపై చల్లి ఆశీర్వదించాల్సింది పోయి వాటిని భగవంతుని ప్రసాదంగా నోట్లోకి తీసుకోవడం అమాయకత్వమే అవుతుంది. అక్షింతలను ఎందుకు ఇస్తారో, ఏయే సందర్భాలలో ఇస్తారో, వాటితో ఏం చేయాలో కనీసం తెలియని వారు ఇలాగే చేస్తారు. మన ఆచారాలు, సంప్రదాయాల పట్ల కనీస ప్రాథమిక పరిజ్ఞానం లేని వారిని ఉద్దేశించి ఈ సామెత పుట్టింది.
  6. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా!

    మంచైనా చెడైనా, ప్రతిఫలం మనం చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అందు చేత ఎప్పుడైనా చెడు చేస్తే దాని మందం ప్రతిఫలం అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పటానికి ఈ సామెత వాడతారు!
  7. గాడిదకొడకా అంటే తమరు తండ్రులు మేము బిడ్డలం అన్నాడట
  8. ఊపర్ షేర్వాని అందర్ పరేషాని!

    చాలా పరిస్థితుల్లో పైకి గంభీరంగా అంతా బానే ఉంది అని కనిపించినా కూడా, మనిషి కష్టంలో, బాధలో లేక ఇబ్బందుల్లో ఉండొచ్చు. అలాంటి సంధర్బాన్ని ఉద్దేశించి వాడే సామెత ఇది.
  9. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు!

    ఎవరినో మోసం చేయాలని తలస్తే తామే మోస పోవటం ఖాయం అని చెప్తోంది ఈ సామెత. అలాంటి సందర్భాన్ని చెప్పేందుకు ఈ సామెత వాడతారు.
  10. బ్రతికుంటే బలుసాకు తినవచ్చు!

    దీనిని బట్టి బలుసు మొక్కలు బాగా విస్తారంగా, కరువు సమయాల్లో కూడా దొరికేవి అన్నమాట. బీదలు వీటి ఆకులు వండుకొని తింటారు. అంటే అన్నీ కోల్పోయాక ఎలాగైనా బ్రతకడానికి ఇది తేరగా దొరుకుతుంది. ఎవరైనా యుద్ధపోరాటాలలో ఓడిపోయి పారిపోతూ ఉంటే ప్రయోగించే మాట ఇది. “బ్రతికుంటే బలుసాకైనా తినవచ్చు” లేకపోతే అదికూడా దక్కదు అని అర్థం. అంటే యుద్ధంలో ప్రాణాలు కోల్పోవచ్చు, శత్రువులకి చిక్కి చిత్రహింసలు అనుభవించవలసిరావచ్చు, ఎందుకొచ్చిన తంటా అని ఇలా అంటూ ఉంటారు.
    “బ్రతికుంటే బలుసాకైనా తినవచ్చు”
  1. కామాతురాణాం న భయం న లజ్జా!

    ఇది సంస్కృత లోకోక్తుల నుంచి తీసుకున్నది. సుభాషితాల్లో కవి ఇలా అన్నాడు…
    అర్థాతురాణాం న గురుర్న బంధుః
    కామాతురాణాం న భయం న లజ్జా
    విద్యాతురాణాం న సుఖం న నిద్రా
    క్షుధాతురాణాం న రుచి ర్న పక్వం
    ధనమే సర్వం అనుకునేవారికి బంధుమిత్రులు అక్కర్లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయినవారికి భయము, సిగ్గు ఉండవు. చదువుమీద అంతులేని శ్రద్ధ ఉన్నవారికి సుఖము, నిద్ర ఉండవు. బాగా ఆకలిగా ఉన్నవారికి పదార్ధం ఉడికిందా, లేదా, రుచిగా ఉందా లేదా అనే విషయాలు పట్టవు.
  1. పందికేం తెలుసు పన్నీరు వాసన!

    ఎప్పుడూ బురదలో దొర్లుతూ మురికి వాసనలో జీవించే పందికి పన్నీరు సువాసన తెలియదు. అలానే విలువ తెలీని మూర్ఖులకు విలువైన బోధలు చేసినా లేదా విలువైన వస్తువులను ఇచ్చినా వారికి వాటి విలువ తెలియక దుర్వినియోగం చేస్తారు. అలాంటి వారిని గూర్చి ఈ సామెత వాడతారు.
  2. కలిగిన వారికి అందరూ చుట్టాలే!

    ఇది లోక సహజం. ధనవంతునికి అందరూ చుట్టాలే. అందుకే సుమతీ శతకకారడు అన్నాడు… ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు అని.
  3. ముడ్డి తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడట!

    ఉచిత సలహాలు ఇచ్చే వారిని గూర్చి చెప్పే సామెత ఇది. తాను ఇచ్చిన సలహాతో అవతలి వాడు చాలా కష్టాలు పడాలి అని తెలిసినా, చాలా సులువుగా చెప్తారు.
  1. క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు.

    కొంత మంది ఎప్పుడు చూసినా చాలా హడావుడిగా వుంటూ తీరికే లేనట్లు కనిపిస్తారు. కానీ వారు చేసే పని ఏమీ ఉండదు అక్కడ. అటువంటి వాళ్ళను ఉద్దేశించి అనేదే ఈ సామెత.
    దీనిలో దమ్మిడి అంటే అతి తక్కువ ధనం. పాతకాలంలో డబ్బును దమ్మిడి, అర్దణా, అణా ఇలా లెక్కపెట్టేవారు. ఎంత కష్టపడినా ఫలితం రానప్పుడు కూడా ఈ సామెతను ఉపయోగిస్తారు.
  1. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి

    కొన్ని సార్లు మనం ఉత్పత్తి చేసిన వస్తువును అమ్మడానికి ప్రయత్నించినప్పుడు దానికి మంచి ధర రాదు, తర్వాత ఎప్పుడో ఆ వస్తువునే కొనాల్సి వచ్చినప్పుడు దాని ధర ప్రియంగా ఉంటుంది… అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు.
    ఉదాహరణకు రైతు పండించిన ధాన్యానికి మార్కెట్‌లో మంచి ధర పలకదు. మంచి ధర అంటే… ధాన్యం పండించడానికి రైతు పెట్టిన పెట్టుబడి, చేసిన శ్రమతో పోలిస్తే దిగుబడి మీద వచ్చిన రాబడి సంతృప్తికరంగా ఉండదు. అదే రైతు ఎప్పుడైనా తన ధాన్యం వర్షానికి తడిసి లేదా ఏ ఇతర కారణంతోనైనా బియ్యం కాని ధాన్యం కాని కొనాల్సి వస్తే ధర చాలా ఎక్కువగా చుక్కలనంటుతున్నట్లు ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చెప్పే సామెత ఇది. అడవి అంటే ఏ మాత్రం విలువలేనిది అనే అర్థంలో ఈ నానుడి వచ్చింది. ఇప్పటిలాగ అటవీచట్టాలు లేని రోజుల్లో… అడవిలో కాసిన కాయలు, పండ్లు ఎవరికి కావలసినవి వారు మోసుకెళ్లగలిగినంతగా కోసుకెళ్లే రోజుల్లో వచ్చిన సామెత ఇది. ఇక కొరివి అంటే కాలుతున్న కట్టె. తాకితే చుర్రుమని కాలుతుంది. కొనాల్సిన వస్తువును తాకడానికి కూడా భయపడాల్సిన పరిస్థితిని తెలిపే నానుడి.
  1. పట్టు చీర అరువిచ్చి, పీట పట్టుకొని వెనకాలే తిరిగినట్టుంది!

    మొహమాటానికి పోయి కష్టాలు తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.
    ఇక సంధర్భాన్ని చూస్తే…
    మొహమాటానికి పోయి ఒకావిడ మరొకావిడకి పట్టు చీర అరువిచ్చిందట. ఆమె ఎక్కడన్నా కూర్చుంటే తన చీరకు మట్టి అంటుతుందని ఒక పీట తీసుకొని ఆమె ఎక్కడ కూర్చుంటుందో అక్కడ పీట వేసేదట.
    అలా మొహమాటానికి పోవటం దేనికీ కష్టాలు తెచ్చుకోవటం దేనికీ అని చెప్పటానికి ఈ సామెత వాడతారు.
  1. క్షేత్రమెరిగి విత్తనం వేయాలి పాత్రమెరిగి దానం చేయాలి!

    భూమి యొక్క సారాన్ని బట్టి ఏ పంట వేస్తె మంచి దిగుబడి వస్తుందో చూసి ఆ పంట వేయాలి. అదేవిధంగా యాచకుని పరిస్థితి తెలుసుకొని మాత్రమే దానం చేయాలి. మీరు ఒక వ్యక్తికి ధనాన్ని దానంగా ఇచ్చారనుకోండి, ఆ వ్యక్తి ఆ ధనంతో సారా తాగి తన భార్యనో లేక వేరే ఎవరినో హింసించాడనుకోండి, దాని వలన అతనికి వచ్చే పాప ఫలంలో మీకు కూడా వాటా ఉంటుంది. అంటే మీరు మీ ధనంతో అప్రత్యక్షంగా పాపాన్ని కొనుకున్నారన్నమాట.
    ఎంత మూఢమతి అయినా కావాలని పాపాన్ని కోరుకోడుగా. మీరు మంచి ఉద్దేశంతో ఒకరికి ఒక దేముడి భక్తి పుస్తకాన్ని దానంగా ఇచ్చారనుకోండి దానిని అతను పఠించి దానిని ఆకళింపు చేసుకొని నలుగురికి దానిలోని విలువలను తెలియచేస్తే దానివలన అతనికి లభించే పుణ్యఫలంలో కొంత భాగం మీకు ప్రాప్తిస్తుంది. అదే ఆ పుస్తకాన్ని తాను చదవక చులకన చేసిన లేక అతని వద్ద వున్న దానిని ఎవరైనా నీచంగా చూసిన అతనికి లభించే పాపఫలం మీకు కూడా సంక్రమిస్తుంది.

    అపాత్ర దానం చేయటం కన్నా దానం చేయకుండా ఉండటమే శ్రేయస్కరం. ఇప్పటి పరిస్థితులలో ఉచితంగా వస్తుందంటే పొందటానికి అపాత్రులు చాలామంది ముందుకు వస్తున్నారు.
  1. ఎగిరెగిరి దంచినా అంతే కూలి ఎగరక దంచినా అంతే కూలి

    ఈ పాలసీని అమలు పరిచే జనాలు కొందరు చాలా ఆఫీసుల్లో తగులుతుంటారు. వృద్ధిలోకి వస్తుంటారు కూడా. చాల సందర్భాల్లో ఇది మనం చూస్తూనే ఉంటాం కూడా. ఒకే ఆఫీసులో పని చేసే ఇద్దరు సమ ఉజ్జీల్లో ఒకడు పైన పడి కింద పడి పని చేస్తుంటాడు, మరొకడు సిల్లీగా టాస్కులు కంప్లీట్ చేస్తుంటాడు. ఇద్దరు చేసే పని ఒకటే, ఇద్దరికీ ఇచ్చే జీతం కూడా ఒకటే! కాని మొదటి వాడు ఎలాగోలా బాసు దగ్గర పేరు సంపాదించాలి అని తపన పడుతుంటాడు… అలాంటి వాడిని సరదాగ విమర్శించే సామెత ఇది.
  2. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకు నాకించినట్లు!

    చిన్న సహాయం చేసి దానికి బదులుగా దాని ముల్యాన్ని ఎన్నో రెట్లు వసూళ్లు చేసే అవకాశవాదుల గురించి ఈ సామెత వాడుతుంటారు.
  3. మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?

    తప్పు మన దగ్గర పెట్టుకొని ఇతరులను నిందించ తగదు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.
  4. ఉన్న మాట అంటే ఉలుకెక్కువ!

    ఎదుటి వ్యక్తితో అతని గురించిన చేదయిన నిజం మాట్లాడినపుడు, నిజం ఒప్పుకునే ధైర్యం లేక ఉలికిపాటుతో మాటలతో ఎదురుదాడి చేస్తాడు. ఆ సందర్భంలో ఈ సామెత వాడుతారు. “నిజం చెప్పితే నిష్ఠూరం” అన్న సామెత అర్థమే దీనికి వర్తిస్తుంది.
  5. ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వచ్చాడట!

    చాలా కష్టాల్లో ఉన్న వ్యక్తి వద్దకు మరొకడు సహాయం కోసం వచ్చినపుడు, కష్టములో ఉన్న వ్యక్తి వ్యంగ్యముగా ఆ రెండవ వ్యక్తికి తన పరిస్థితిని ఈ సామెత ద్వారా తెలియచేయుట పరిపాటి.
  6. అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట

    ఇది అజ్ఞానానికీ, అతి తెలివికీ పరాకాష్టగా చెప్పే సామెత. తెలియక పోయినా తెలిసినట్లు నటించేవారి అంటించే చురక.
    అల్లం కారంగా, ఘాటుగా ఉంటుంది. బెల్లం తీయగా ఉంటుంది. ఇక పుల్లగా ఉండేవి వేరే పదార్ధాలున్నాయి. అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటది అని ఎవరైనా అంటే వారికి అల్లం రుచి తెలియదు, బెల్లం రుచి తెలియదు, పుల్లగా ఉండేదేమిటో తెలియదు. కనుక ఒకటి అడిగితే మూడు విషయాలు తెలియవని చెప్పుకున్నారు. కనీసం తన తెలియనితనాన్ని దాచుకోవాలన్న జ్ఞానం కూడా వారికి లేదన్న మాట.
  1. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ వుండాలంటారు.

    ఏపని చేయడానికైనా తనకు సమానమైన వారిని ఎంచుకోవాలని ఈ సామెత అర్థం.
  2. అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

    కొందరు తమకు ఏమీ తెలియకపోయినా అన్నీ తమకే తెలుసునన్నట్లుగా ఏకథాటిగా మాట్లాడుతూ ఊదరగొడుతూ ఉంటారు. వారిని గురించి ఈ సామెత వాడతారు. కొందరు తమకు అన్నీ తెలిసినా మౌనంగా ఏమీ తెలియనట్లుగా ఉంటారు.
  3. పక్కింటి పోరు పండగంత వేడుక.

    పొరుగు వారు పోట్లాడుకుంటుంటే ఇరుగు పొరుగు వారికి అదొక వేడుక. ఇది మానవ సహజం. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత
  4. పిల్లల్ని కనగలము కాని వాళ్ళ బుధ్ధుల్ని కనగలమా!

    మనకు పుట్టిన పిల్లల సత్ప్రవర్తన అనేది మొత్తం మన చేతుల్లో ఉండదు అని చెప్పటానికి ఈ సామెత వాడతారు.
    కొంత పుట్టుకతో వచ్చినది, కొంత మనం నేర్పినది అయినప్పటికీ, మిగతాది వారి ఆలోచనా విధానం వారి స్నేహాల మీద ఆధారపడి ఉంటుంది.
  5. కట్టుకున్న దానికి కట్టుబట్టల్లేవు కానీ ఉంచుకున్న దానికి ఉన్ని బట్టలు కొంటాడట!

    సొంత వాళ్ళని పట్టించుకోక గాలికి వదిలేసి, పరాయి వారికి సేవలు చేసే బుద్ధిలేని వారిని ఉద్దేశించి ఈ సామెత చెప్తారు.
  6. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు.

    చెయ్యకూడనివి అన్నీ చేస్తూనే తమని తాము సమర్ధించుకుంటూ పునీతులుగా ప్రకటించుకునేవాళ్ళని వ్యంగ్యంగా విమర్శించే సామెత ఇది.
  7. శనేశ్వరానికి నిద్రెక్కువ దరిద్రానికి ఆకలెక్కువ.

    మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్పేట్టు, “ఎక్కువ సేపు నిద్రపోవటం అనేది మంచిది కాదు ఇంటికి శని పడుతుంది అని.” కాని దాని వెనక అసలు కారణం అతిగా నిద్రపోవటం వల్ల మనిషి బధ్ధకస్తుడిగా మారతాడు కనుక. మామూలుగా చెప్తే వినం కనుక శనితో ముడి పెట్టారు. కనీసం ఆ భయంతో పడుకోము అని.
    ఇక దారిద్ర్యం అంటే ఎటువంటి సంపాదనా లేక తిండికీ బట్టకీ నోచుకోని పరిస్థితి. ఆలాంటి వాడికే పాపం ఆకలి ఎక్కువ అని అంటారు.
  1. ఒడ్డునుండి ఎన్నైనా చెప్తారు.

    నీటిలో మునిగిన వానికే ఆ నీటి లోతు, చలి ఇతరత్రా సాధకబాధకాలు తెలుస్తాయి. ఒడ్డున నిలబడి చూసే వానికి అవేమీ పట్టవు సరికదా, అంతా బాగానే ఉందనుకుంటాడు. ఇదే విషయాన్ని కష్టాలలో ఉన్నవానికి , ఇవన్నీ మామూలే అంటూ ఉచిత సలహాలిచ్చేవాణ్ణి ఉద్దేశించి ఈ సామెత ద్వారా చెబుతారు.
  2. ఎద్దు పుండు కాకికి ముద్దు.

    ఎదుటి వాళ్ల బాధను తీర్చకపోగా అందు నుంచి ప్రయోజనం పొందాలని చూసేవాళ్లను ఉద్దేశించి ‘ఎద్దు పుండు కాకికి ముద్దు’ అనే సామెతని విరివిగా వాడుతుంటారు.

    వివరణ:ఎడ్ల మూపురం మీద కాడి రాసుకుని పుండు పడుతుంటుంది. పొలం దున్నాలన్నా, బండి లాగాలన్నా ఎద్దు కాడిని మోయాల్సిందే. అలా ఏళ్ల తరబడి పని చేసినప్పుడు చర్మం ఒరుసుకునిపోయి ఎర్రగా పుండు పడుతుంది. ఆ పుండు తగ్గే వరకు ఎద్దుకు విశ్రాంతిని ఇస్తారు. కానీ కాకులు ఆ ఎద్దును కుదురుగా ఉండనివ్వవు. దాని మూపురం మీద ఉన్న పుండును పొడిచి తింటాయి. లేదా ఆ పుండును పొడిచి తినాలని ఒకటే కాకిగోల చేస్తాయి. ఎద్దును విసిగిస్తాయి. ఎద్దు తోకతో తరిమికొడితే కాకులన్నీ ఎగిరి పోతుంటాయి. అలా తోకను కదలిస్తూ ఉంటేనే కాకి దూరంగా ఉంటుంది. లేదంటే ఎద్దుకు కాకి నరకం చూపిస్తుంది.

    ఈ సన్నివేశం పల్లెల్లో ఎక్కడైనా కనిపిస్తుంది. దీన్ని చూసే ఈ సామెత పుట్టింది. పుండు బాధ ఎలాంటిదో, ఎంత ఉంటుందో దానిని భరించే ఎద్దుకే తెలుస్తుంది. దానితో పని చేయించుకునే రైతుకు కూడా ఆ బాధ తెలుసు. కానీ కాకి ఏమాత్రం పట్టించుకోదు. ఎద్దు మాంసాన్ని లాక్కుని తినడమే దానికి కావాల్సింది.
  1. యదార్థ వాది లోక విరోధి!

    నిజం మాట్లాడితే నిష్టూరం అనే సామెత లాంటిదే ఇదీనూ. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది అన్నట్టు, నిజం చెప్పేవాడి మాట అవతలి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే వారు లోక విరోధులు అవుతారు అని చెప్తోంది ఈ సామెత
  2. గురివింద గింజ తన నలుపెరగదంట.

    గురివింద గింజ ముందు భాగమంతా ఎరుపుగా ఉండి, వెనుక వైపున ఓ నల్లటి మచ్చ కలిగి ఉండును. కానీ, ఆ నలుపు సంగతి ఎరుగక అది తనని తాను ఓ గొప్ప అందగత్తె నని భ్రమపడుతుంది. అదే విధముగా, తమలోని లోట్లు తెలుసుకోలేక, ఇతరులను తప్పు పట్టువారిని ఈ సామెతతో పరిహసించుట పరిపాటి.
  3. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుంది!

    రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు. సమాజంలో సత్యం, ధర్మం లేనప్పుడు కరవుకాటకాలు దేశంలో ప్రబలుతాయి. అంతా అధర్మంతో ఉన్నప్పుడు భూమి కూడా ప్రజలకు సాయం చేయదు, సారం కోల్పోతుంది. కనుక దేశనేతలు ధర్మాన్ని తప్పకూడదని ఈ సామెత చెప్తోంది.
  4. చెరువు మీద అలిగి కడుక్కోవటం మానేసాడంట!

    మనం అందరం చాలా సార్లు ఒక దానిమీద కోపం ఇంకో దానిమీద చూపిస్తుంటాం. దాని వల్ల జరిగే నష్టం ఏంటో అప్పుడు తెలీకపొయినా తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. అలాంటి సందర్భాన్నే వివరిస్తుంది ఈ సామెత.
  5. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తుతుంది

    రౌతు అనగా గుర్రపు స్వారీ చేసేవాడు. అలాంటి రౌతు మెత్తనివాడైతే గుర్రము అతని ఆదేశాలని సరిగా పాటించదు. అదే విధంగా అధికారంలో ఉన్న వ్యక్తి మెత్తనివాడైతే అతని కింద పని చేసేవాళ్ళు సరిగా పనిచేయరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.
  6. రానప్పుడు బ్రహ్మ విద్య, వచ్చినప్పుడు కూసు విద్య!

    ఏదైనా సరే మనకు తెలియనంత వరకు అదేదో బ్రహ్మ విద్య లాగా అనుకుంటాం. అదే ఒకసారి మనకి తెలిస్తే ఓసినీ ఇంతేనా అనిపిస్తుంది. ఎదైనా అంతే, తెలిసేవరకు బ్రహ్మ విద్య, తెలిసాక కూసు విద్య!
  7. రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే, చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట!

    కొద్ది ప్రయత్నంతోనే ఫలితాన్ని ఆశించే వారిని వ్యంగ్యంగా విమర్శించే సామెత ఇది.
  8. సుఖమొస్తే మొహం కడుగ తీరిక లేదన్నట్లు

    సుఖాలకు అలవాటుపడినవారు సోమరులుగా తయారవుతారు అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం.
  9. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే!

    ఢిల్లీ అంతటి నగరానికి రాజైనా ఓ తల్లికి కొడుకే. అలాగే మనం ఎంత గొప్పవారమయినా మన మూలాల్ని, గతాన్ని మర్చిపోకూడదు అని దీని అర్థం.
  10. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు!

    అంబలి అంటే ఒక రకమైన గంజి, జావ లాంటి నీళ్లు. ఒక మాదిరి పెద్దవైన మట్టి కుండల్లో ఉంచుతారు. అది త్రాగడం ఏమీ అంత కష్టమైన పనేమీ కాదు. రెండు చేతులతో కుండ పట్టుకొని ఎత్తి గట గటా త్రాగెయ్యడమే. దానికి కూడా సహాయం కావాలంటే నోరెళ్లబెట్టాల్సిందే.

    పూర్వం ఒక పెద్దాయనకి పెద్ద పెద్ద బుర్ర మీసాలు ఉండేవట. అంబలి త్రాగుదామనుకుంటే మీసాలు అడ్డొస్తున్నాయట. అంబలి జావ వాటికి అంటుకు పోతోందట. అప్పుడు ఒకణ్ణి పిలిచి “ఒరేయ్ నేను రెండు చేతులతో అంబలి ఎత్తి తాగుతాను గానీ , నువ్వు నా మీసాలు ఎత్తి పట్టుకో” అని అన్నాడట. వీడు సరే అన్నాడట!!

    ఇంత చిన్న పనికి కూడా సహాయకుడా అని చూస్తున్నవాళ్లు అందరూ పక పకా నవ్వుకున్నారట.
    చేసేదే చిన్న పని, సులువైన పని. దానికి కూడా సహాయకుడు కావాలని కోరే వాళ్లని, ఆ ఉపపని చెయ్యడానికి ఒప్పుకున్నవాళ్లని, ఇద్దరినీ కలిపి ఈ మాట అంటూ ఉంటారు.
    దీన్ని ఇంకోలా కూడా చెప్తారు:-
    గంజి మాత్రమే తాగగలిగే స్తోమత కలిగినవాడు, తాను గంజి తాగేటప్పుడు తన మీసాలు ఎత్తి పట్టుకోవటానికి ఇంకో మనిషిని నియమించుకోలేడు. అలాగే తమ ఆర్థిక స్థోమతే బాగాలేని వారు, వేరొకరిని తమకింద పనికిగాని, పరపతి కోసంగాని నియమించుకున్నప్పుడు వారిని వెమర్శిస్తూ ఈ సామెతను ఉపయోగిస్తారు.
  1. జమ్మి ఆకులతో విస్తరి కుట్టినట్లు!

    జమ్మి ఆకులను దసరా పండుగ రోజున చేతులు మార్చుకుంటూ ప్రజలు పండుగ జరుపుకుంటారు. అవి ఎంత చిన్నగా ఉంటాయో మనకు తెలిసినదే. వాటితో విస్తరి కుట్టడం అస్సలు సాధ్యం కాదు. అలా ఎదన్నా ఒక కష్ఠతరమైన పనిని వర్ణించటానికి ఈ సామెత వాడతారు.
  2. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవటం!

    కొన్ని కొన్ని సార్లు చాల చిన్న విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచించి మనశ్శాంతి లేకుండా చేసుకుంటాం. ఆలాగే చిన్న పనితో లేదా మాటతో పోయేదానికి చాలా కష్టపడి చాలా డబ్బు/సమయం వెచ్చించి చివరకు ఆనందం లేకుండా చేసుకుంటాం, అలాంటి సందర్భాలని వివరించటానికి ఈ సామెత వాడతారు.
  3. ఎక్కినోడిది గుఱ్ఱం ఏలినోడిది రాజ్యం.

    దొరికింది దొరికినట్లుగా అనుభవించే వారి గురించి చెప్పే సామెత ఇది.
  4. కాలం కలిసి వస్తే  ఏట్లో వేసినా ఎదురు వస్తుంది

    ఈ సామెతను అనుకోని రీతిలో సహాయం కలిసివచ్చే సందర్భములో ఉదహరిస్తారు. మనకి మంచి కాలం నడుస్తున్నప్పుడు, మనం ఎటువంటి తప్పులు చేసినా అవి మంచిగా మలచబడతాయి అని చెప్తోంది ఈ సామెత.
  5. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు!

    మనకు అందుబాటులో ఉన్న వస్తువులు పనికిరావు అనే సందర్భంలో ఈ సామెత వాడతారు.బాగా పరిచయమున్నవాళ్ళు చాలా గొప్పవాళ్లని ఎవరైనా చెప్పినా మన మనసు నమ్మలేదు. ఎక్కడెఎక్కడికో పోయి మహాత్ములని ఎవరెవరినో నమ్ముతాము..
    అలాగే ఈ వేపాకు, తులసి, పసుపు ఫలానా దానికి మంచి మందు అంటే ఒప్పుకోము, ఏదో చెప్తున్నారులే అని తోసి వేస్తాము(లేదా అడవిలో పెరిగిన మూలికలో సహజ వాతావరణంలో వచ్చింది గాబట్టి శక్తి ఎక్కువ గా ఉంటుంది అనే భావన ఐనా కావచ్చు)
    ఇంట్లో ఉండేవాళ్ళు సమర్థులైనా పనికిరారు అనే అర్థంలో వాడే సామెత ఇది.
  1. కూర్చుని తింటే కొండలైనా రూ తరిగిపోతాయి!

    శ్రమించకుండా తాతలు, తండ్రులనుండి సంక్రమించిన ఆస్తులను ఖర్చుపెడుతూ జీవిస్తే అవి ఎంతో కాలం మిగలవు అని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు
  2. కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట!
    కూడూ గుడ్డా అన్నవి మనిషికి కనీస అవసరములు. అవి లేకపొతే జీవించటం కష్టము. అవే అడగకపొతే బాగా చూసుకుంటా అనటంలో ఆ వ్యక్తి గుణం తెలుస్తుంది. అతనికి ఇతరులకు సహాయము చేసే గుణం లేదని తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు మనకి రోజువారి జీవితంలో చాలా మంది తారసపడతారు.ఈ విషయాన్నే ఈ సామెత ద్వారా వ్యంగ్యంగా చెప్తారు.
  1. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు!

    ఉల్లిపాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రుచి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి అని చెప్తారు. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా వుంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత పుట్టింది.అలా అని అతిగా ఏది తిన్నా మంచిది కాదండోయి!
  1. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు!

    సాధారణముగా మనము దొంగను ఒక అపరిచితుడి రూపంలో ఊహిస్తాము. కానీ, సొంత ఇంట్లో వ్యక్తే ఇతర కుటుంబ సభ్యులను మోసము చేస్తున్న యెడల, అట్టి వారిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. అలాంటి వారిని ఆ పరమ శివుడు కూడా పట్టుకోలేడు అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం.
  2. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా?

    ఈ సామెత పైపై ప్రేమలు ప్రదర్శించే వారికి వర్థిస్తుంది. మనసులో ఎలాంటి ప్రేమ లేకపోయినా ప్రజల మెప్పు కోసం బాధల్లో ఉన్నవారిని కౌగిలించుకున్నంత మాత్రాన వారికి స్వాంతన చేకూరదు. లేని ప్రేమలు ప్రదర్శించవద్దని దీని అర్థం.
  3. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం!

    ఒక కప్పని పాము నోటిలో కరుచుకోని ఉందంట. అదే సమయంలో అటుగా వెళ్తున్న దానయ్యని తీర్పు అడిగినాయంట. పామేమో తినాలి అదే న్యాయం, ఇది నా ఆహారం అని అన్నదంట! కప్పేమో నేను బలహీనుడిని, నన్ను కాపాడాలి అన్నదంట!

Write A Comment